అనువాదకుని మాట
ప్రియమైన సోదరసోదరీమణులారా!
ఖురాను గ్రంథం వివిధ రూపాల్లో వర్గీకరించబడి ఉంది. సామాన్య వర్గీకరణ ప్రకారం- ఒక్కొక్క సూరాను ఒక్కొక్క అధ్యాయంగా పేర్కొంటారు. అలాచూస్తే నూట పద్నాలుగు అధ్యాయాలు అవుతాయి. అయితే ఖురాను గ్రంథం స్వయంగా 15:87 వ వాక్యంలో ఒక వర్గీకరణ చేస్తుంది. దాని ప్రకారం- ఫరాహీ విద్యా పీఠం పండితులు 114 సూరాలను ఏడు గ్రూపులుగా వర్గీకరించారు. కనుక ఇక మీదట గతంలో అధ్యాయాలుగా పేర్కొనే సూరాలను, సూరాలుగానే పేర్కొంటూ, ఈ ఏడు గ్రూపులను ఏడు అధ్యాయాలుగా పేర్కొనటం జరుగుతుంది. ఈ విషయాన్ని గౌరవ పాఠకులు గమనించగలరు.
ఈ సంకలనా క్రమంలో ఖురాను గ్రంథాన్ని మీరు అధ్యయనం చేస్తే, గతంలో మీకు ఉన్న గందరగోళ పరిస్థితి తొలగి ఖురాను అవతరణా లక్ష్యాన్ని సులువుగా అర్థం చేసుకోగలరు. తద్వారా వ్యక్తిగతంగా మీ ఆత్మ ప్రక్షాళన చేసుకోవటం మీకు సులభతరమౌతుంది. సామాజిక జీవితంలో తోటి ముస్లిముల పట్ల, తోటి ముస్లిమేతరుల పట్లా సద్భావం, సానుభూతి వంటి ఖురాను ఆశించే ఉత్తమ భావాలు మీలో అంకురిస్తాయి. – అనువాదకుడు
ఖురాను గ్రంథ సారాంశం- ఒక సందేశహరుని హెచ్చరికల చరిత్ర అని చెప్పవచ్చు. ముహమ్మద్(స) ప్రవక్త (నబి)తో పాటు, సందేశహరులు (రసూల్) కూడా. సర్వేశ్వరుడైన అల్లాహ్ ప్రజల సంస్కరణ కోసం ప్రవక్తలను నియమించి, వారికి ఆకాశ వాణి (వహి), ప్రేరణ (ఇలహాం) ద్వారా మార్గదర్శకం చేస్తాడు. అలాంటి వారినే ప్రవక్తలంటారు. కానీ ప్రతి ప్రవక్తా సందేశహరుడు కాకపోచచ్చు. సందేశహరుని బాధ్యత (రిసాలత్) ప్రవక్తల్లో కొందరికే లభిస్తుంది. ఖురాన్’లో పేర్కొన్న సందేశహరుని వివరాల ప్రకారం- అతడు తన జాతి ప్రజల సమక్షంలో దేవుని న్యాయపీఠం ఏర్పరచి, వారిమధ్య తీర్పుచేసి వెళిపోతాడు. ఖురాన్ ప్రకారం- సందేశహరుల సందేశంలో- 1) హెచ్చరిక- 2) బహిరంగ హెచ్చరిక, 3) సంపూర్ణ సత్య నిరూపణ, 4) వలస, ఇంకా 5) తెగతెంపుల ప్రకటన అనే దశల వారీగా సాగి, ఆ తీర్పు ప్రత్యక్షమౌతుంది. దాని ప్రత్యక్షత ఆకాశ న్యాయపీఠం భూమిపై
అవతరించినట్లు ఉంటుంది. దేవుని శిక్షా-బహుమానాల తీర్మానాలు (దైనూనత్) ప్రత్యక్షమౌతాయి. సందేశహరుని జాతి జనుల పట్ల అది ఒక చిరు ప్రళయం (ఖయామతె సుగ్ర)గా పరిణమిస్తుంది. ఖురానులో ప్రస్తావిత చరిత్ర ఆధారంగా ఈ సందర్భంలో రెండే పరిణామాలు చోటుచేసుకుంటాయి. వాటిలో…
1) సందేశహరుని సహచరులు, సంఖ్యా పరంగా తక్కువమంది ఉంటారు. వారికి వలస ప్రాంతం కూడా లభించదు.
2) తన కొద్దిపాటి సహచరులను తీసుకొని బయలుదేరుతాడు. అతను బయలుదేరటానికి ముందే ఏదైనా ప్రాంతంలో అతని కోసం స్వేచ్ఛా, స్థిరత్వాలతో నివసించే ఏర్పాటు చేస్తాడు.
ఈ రెండు రూపాల్లోనే సందేశహరల విషయంలో దేవుని ఈ సాంప్రదాయం (సున్నతె ఇలాహి) కచ్చితంగా అమలైపోతుంది. అది ఖురానులో ఈ క్రింది విధంగా ప్రసావితమైంది.
ప్రతి సమాజానికీ ఒక ప్రవక్త ఉన్నాడు. కాబట్టి వారి ప్రవక్త వారి వద్దకు వచ్చేసినపుడు వారి వ్యవహారంలో న్యాయబద్ధంగా తీర్పు చెయ్యబడుతుంది. వారికెలాంటి అన్యాయం జరగదు. -10:47
మొదటి స్థితిలో ప్రవక్త తన జాతిని విడిచి, మరణించిన తరువాత లేదా వలస పోయిన తరువాత దేవుని ఆ తీర్పు ఏవిధంగా వస్తుందంటే- ఆకాశ సైన్యం అవతరించి, ఆ జాతి పూర్తిగా తుడుచుకుపోయే భయంకరమైన తుఫాను సృష్టిస్తుంది.
ఇక రెండవ స్థితిలోనూ ఇదే నియమం వర్తిస్తుంది. కానీ అందులో ఈ శిక్షా తీర్మానం ప్రవక్త, అతని సహచరుల ఖడ్గాలతో అమలౌతుంది. ఈ సందర్భంగా వారికి కొంత సమయం దొరుకుతుంది. ఈ నిడివిలో ప్రవక్త, తన స్థానిక ప్రజలపై ‘సంపూర్ణ సత్య నిరూపణ’ (ఇత్మామె హుజ్జత్) చేస్తాడు. తన సందేశాన్ని విశ్వసించిన వారి శిక్షణ, ప్రక్షాళన గరిపి, వారిని రాబోయే సత్యాసత్యాల పోరాటానికి సన్నద్ధం చేస్తాడు. ఇంకా, తన స్థానిక వ్యవస్థను ఒకవైపు- సత్య తిరస్కారులను అంతం చేయటానికి, మరొక వైపు- సత్యపథగాముల ఉన్నతిని సాధించటాని తగిన విధంగా పటిష్ట పరుస్తాడు.
ప్రవక్త ముహమ్మద్ వారి విషయంలో ఈ రెండవ విధానమే అవలంబించబడింది. కనుక ఆయన జాతి విషయంలోనూ, ఆయన తరఫున-
1) హెచ్చరిక- 2) బహిరంగ హెచ్చరిక, 3) సంపూర్ణ సత్య నిరూపణ, 4) వలస, ఇంకా 5) తెగతెంపుల ప్రకటన అనే దశలు దాటి, శిక్షా-బహుమానాల తీర్పు వంటి ఘట్టాలే ఖురాన్ చరిత్రకి ప్రధాన శీర్షికలయ్యాయి. దాని ప్రతి అధ్యాయమూ ఈ విషయాల నేపథ్యంలో అవతరించింది. కాబట్టి దాని సమస్త భాగాలన్నీ వీటికి అనుగుణంగానే సంకలనం అయ్యాయి.
ఈ క్రమానికి (Order) సంబంధించిన విధానం సంక్షిప్తంగా ఖురాను గ్రంథ సూరాలన్నిటినీ పరస్పరం జంటలుగా చేసి, ఏడు విభాగాలుగా సమకూర్చటం జరిగింది. అనగా ప్రతి అధ్యాయమూ ‘విషయం’ (Content) పరంగా తనదంటూ ఒక జంటను కలిగి ఉంటుంది. ఇంకా జంటల్లో ఏ విధమైన సంబంధం ఉంటుందో అదేవిధమైన సంబంధం ఆ రెండిటిలో ఉంది. కొన్ని అధ్యాయాలు దానికి మినహాయింపుగా ఉన్నాయి. వాటిలో సూరయె ఫాతిహా ఒకటి. అది పూర్తి ఖురాను గ్రంథానికి పీఠిక వంటిది. మిగతా సూరాలు ముగింపు భాగంగా, పరిపూర్ణతగా లేదా అధ్యాయం పరిసమాప్తిగా వచ్చాయి. కాబట్టి వాటిని మేము ‘ఏడు సమూహాలు’ (Seven groups)గా వర్గీకరించి, అధ్యాయాలుగా వ్యవహరిస్తున్నాం. ఖురానులో సూరాలు ఈ క్రమం (Order)లోనే సమకూర్చి ఉన్నాయి. దీనికి సంబంధించిన ఆధారాన్ని హిజ్ర్ సూరాలో చూడగలరు.
మేము నీకు ఏడు ఆయతులను ఇచ్చి ఉన్నాము. అవి పదే పదే పునరావృతం అవుతుంటాయి. ఇంకా మహోన్నతమైన ఖుర్ఆన్ను నీకు ప్రసాదించాము. -15:87
ఖురాను గ్రంథానికి చెందిన ఈ ఏడు అధ్యాయాల్లో ప్రతి అధ్యాయం ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ మక్కీ సూరాలతో మొదలౌతుంది. ఇంకా ఒకటి లేదా ఒకటి కంటే ఎక్కువ మదని సూరాలతో ముగుస్తుంది.
1 వ అధ్యాయం మొదటి సూరా ఫాతెహా నుండి మొదలై, 5 వ సూరా మాయిదాతో ముగుస్తుంది. ఇందులో ఫాతెహా సూరా మక్కీ మిగిలిన నాలుగు సూరాలు మదనీ.
2 వ అధ్యాయం 6 వ సూరా అనాంతో మొదలై 9 వ సూరా తౌబాతో ముగిసిపోతుంది. అనాం, ఆరాఫ్ రెండూ మక్కీ సూరాలు ఇంకా అన్ఫాల్, తౌబా మదనీ సూరాలు.
3 వ అధ్యాయంలో 10 వ సూరా యూనుస్ నుండి 24 వ సూరా నూర్’తో ముగుస్తుంది. మొదటి పద్నాలుగు సూరాలు మక్కీ. చివరిలో ఒకటి నూర్ సూరా మదనీ.
4 వ అధ్యాయం 25 వ సూరా ఫుర్ఖాన్ సూరా నుండి మొదలౌతుంది. 33 వ సూరా అహ్జాబ్ సూరాతో ముగుస్తుంది. ఇందులో మొదటి ఎనిమిది సూరాలు మక్కీ. చివరి అహ్జాబ్ సూరా మదనీ.
5 వ అధ్యాయం 34 వ సూరా సబా సూరాతో మొదలౌతుంది. 49 వ సూరా హుజ్రాత్’తో సూరాతో ముగుస్తుంది. ఇందులో మొదటి పదమూడు సూరాలు మక్కీ మరియు చివరిలో మూడు మదనీ.
6 వ అధ్యాయం 50 వ సూరా ఖాఫ్ నుండి మొదలై 66 వ సూరా తహ్రీంతో ముగుస్తుంది. ఇందులో ఏడు మక్కీ సూరాలు, పది మదనీ సూరాలు.
7 వ అధ్యాయం 67 వ సూరా ముల్క్ సూరాతో మొదలై 114 వ సూరా నాస్ సూరాతో ముగుస్తుంది. ఇందులో చివరి రెండు మౌజ్జతైన్ మదనీ ఇంకా మిగిలినవన్ని మక్కీ.
వీటిలో ప్రతి అధ్యాయానికి ఒక శీర్షిక ఉంటుంది.
మొదటి అధ్యాయం శీర్షిక- యూద, క్రైస్తవ వర్గాలపై సంపూర్ణ సత్య నిరూపణ, వారి స్థానంలో ఒక కొత్త సంఘానికి పునాది, దాని అంతర్బాహ్యాల ప్రక్షాళన. దానితో దేవుని చివరి ఒప్పందం.
రెండవ అధ్యాయలో అరబ్బు దైవేతర శక్తుల ఆరాధకుల (ముష్రికీనె మక్కా)పై సంపూర్ణ సత్య నిరూపణ, విశ్వాసుల అంతర్బాహ్యాల పరిశుద్ధత, దేవుని శిక్షా-బహుమానాల ప్రకటన (దైనూనత్).
మూడు నుండి ఆరవ అధ్యాయం వరకు శీర్షిక ఒక్కటే. అది హెచ్చరిక, శుభవార్త, అంతర్బాహ్యాల పరిశుద్ధత.
ఏడవ, చివరి అధ్యాయం శీర్షిక- ఖురైష్ నాయకులపై రానున్న చిరు ప్రళయ (ఖయామతె సుగ్ర) హెచ్చరిక. వారిపై సంపూర్ణ సత్య నిరూపణ, దాని పర్యవసానంగా రానున్న శిక్ష సమాచారం. ప్రవక్త ముహమ్మద్ కొరకు అరబ్బు దేశంలో సత్య ధర్మ ప్రాబల్య శుభవార్త. దీనిని సంక్షిప్తంగా హెచ్చరిక మరియు శుభవార్తలని వ్యాఖ్యానించ వచ్చు.
వాటిలో మొదటి అధ్యాయాన్ని వేరు చేస్తే, ఖురానులో వాటి క్రమం ముగింపు నుండి ప్రారంభం వైపునకి ఉంటుంది. కనుక యేడవ అధ్యాయం హెచ్చరిక, శుభవార్తలతో పరిపూర్తి అయిపోతుంది.
ఆ తరువాత ఆరవ, ఐదవ, నాలుగోవ మరియు మూడవ అధ్యాయంలో హెచ్చరిక, శుభవార్తలతో పాటు, అంతర్బాహ్యాల పరిశుద్ధత అంశం కూడా చేరిపోయింది.
ఇక రెండవ మరియు ఈ క్రమానికి చెందిన చివరి అధ్యాయంలో ప్రవక్త హెచ్చరిక, శుభవార్తల తీవ్రత ఉచ్చ స్థాయీకి చేరిపోయింది. అందువలన సంపూర్ణ సత్య నిరూపణ, అంతర్బాహ్యాల పరిశుద్ధతతోపాటు సత్య తిరస్కారుల కోసం ఆకాశ న్యాయపీఠానికి చెందిన ఆ తీర్పు కూడా ముందుకు వచ్చేస్తుంది. అందుకే దానిని మహా తీర్పుదినానకి ముందు వచ్చే అంతిమ దేవుని శిక్షా-బహుమానాల తీర్పుగా మేము అభివర్ణిస్తున్నాం.
మొదటి అధ్యాయం మక్కా బదైవోపాసకులకి కాక, కేవలం యూదుల, క్రైస్తవుల కోసం ప్రత్యేకం. కనుక అది ఇతర అధ్యాయాలకంటే వేరుగా కనిపిస్తుంది. కానీ, ఖురాను ప్రారంభం నుండి చూస్తే ఇది కూడా ‘సంపూర్ణ సత్య నిరూపణ’ (ఇత్మామె హుజ్జత్) మరియు ‘అంతర్బాహ్యాల పరిశుద్ధత’ (తస్కియా వ తత్’హీర్) తరువాత, తౌబా సూరాలో శిక్షా-బహుమానాల దేవుని అంతిమ తీర్పు (దైనూనత్)కి చెందిన అంశంతో అదే మాదిరి సంపూర్ణంగా సరిపోలి ఉంటుంది. ఏవిధంగానైతే పై అధ్యాయాలు ముగింపు నుండి ప్రారంభం వైపునకు వచ్చినప్పటికీ, ఆరోహణా క్రమంతో జతపడి ఉన్నాయో. అందువల్ల రెండవ అధ్యాయం గురించి చెప్పాలంటే, అది శిక్షా-బహుమానాల దేవుని అంతిమ తీర్పు అనే ఒకే అంశం అటు- గ్రంథ ప్రజలకి, ఇటు- మక్కా బదైవోపాసకులకి కూడా వర్తిస్తుంది. ఇందులో విషయం తారా స్థాయీకి చేరి, అంతమైపోతుంది.
మొదటి అధ్యాయానికి అనుసంధానం చేయవలసిన అవసరాన్ని దృష్టిలో ఉంచుకుని రెండవ అధ్యాయం కోసం అవతరణా క్రమాన్ని అనుసరించినట్లు దీని ద్వారా స్పష్టమైంది.
ఈ క్రమంలో మొదటి అధ్యాయం ప్రాధాన్యత కలిగి ఉండటానికి కారణం- ఖురాన్ అనుయాయులు (ముస్లిములు) దాని ప్రాథమిక సంబోధితులు కనుక. హెచ్చరిక, శుభవార్త మరియు సంపూర్ణ సత్య నిరూపణ అంశం, మొదటి అధ్యాయం మినహా, సాధారణంగా మక్కా సూరాల్లో మరియు అంతర్బాహ్యాల పరిశుద్ధత అనే ఆంశం మదనీ సూరాల్లో వివరించబడతాయి. అయితే ఈ రెండు అంశాలూ ప్రతి అధ్యాయంలోనూ సమరసత, సారూప్యత కలిగి ఉంటాయి. దీనిని వేరు నుండి కాండం, కాండం నుండి శాఖలు అంకురిస్తున్నట్లు ఉంటుందని చెప్పవచ్చు.
ప్రవక్త ముహమ్మద్ నియుక్తులైన కారణంగా అరేబియా క్షేత్రంలో దేవుని న్యాయపీఠం అవతరించింది. దాని సన్నివేశాలు ఈ ఖురాను గ్రంథంలో ఎంతో సుందరమైన పద్ధతిలో శాశ్వతంగా భద్రమైపోయాయి. ఈ విధంగా చూస్తే, ‘దేవుని న్యాయపీఠం సర్వ మానవాళి కోసమూ ఒకరోజు అదేవిధంగా అవతరించనుంది’ అనే ధర్మానికి చెందిన ఈ మౌలిక వాదన సంపూర్ణంగా నిరూపణ అయిపోయింది.
మొదటి అధ్యాయ పరిచయం
సూరయె ఫాతిహ(1) – సూరయె మాయిద (5)
ఈ అధ్యాయంలో ప్రస్తావనకు వచ్చే విషయాలు
1) యూద, క్రైస్తవ వర్గాలపై సంపూర్ణ సత్య నిరూపణ
2) వారి స్థానంలోనే ప్రవక్త ఇబ్రాహీం వంశావళికి చెందిన మరొక శాఖ నియామకం
3) ఇస్మాయీల్ సంతతిలో నుండి ముస్లిం సమాజానికి పునాది
4) ముస్లిం సమాజ అంతర్బాహ్యాల ప్రక్షాళన
5) ఇంకా ముస్లిం సమాజ దేవుని అంతిమ ఒడంబడిక
ఇది ఖురాన్ మొదటి అధ్యాయం. ఇందులో అల్-ఫాతిహా నుండి అల్-మాయిదా వరకు ఐదు సూరాలు ఉన్నాయి. ఈ సూరాల కథనాలను బట్టి వీటిలో- మొదటి సూరా అల్-ఫాతిహా అరబ్బు దేశ కేంద్ర పట్టణమైన మక్కా నగరంలో మిగిలిన నాలుగు సూరాలు అల్-బఖర, ఆలె ఇమ్రాన్, అన్-నిసా మరియు అల్-మాయిద్ వలస (హిజ్రత్) తరువాత మదీనాలో అవతరించాయి.
ఖురాను గ్రంథానికి చెందిన ఇతర అధ్యాయాల వలే ఈ అధ్యాయం కూడా మక్కా సూరాతో ప్రారంభమై, మదనీ సూరాలతో అంతమౌతుందన్నది గమనార్హం. అల్-ఫాతిహా మరియు ఇతర సూరాల మధ్య విషయ (Content) పరంగా పరస్పరం రెండు రకాల సంబంధాలున్నాయి. వాటిలో… 1) దాసుని వేడుకోలు మరియు దేవుని సమాధానం వంటి సంబంధం, 2) సంక్షిప్తం (ఇజ్మాల్) మరియు వివరణాత్మకం (తఫ్సీల్) వంటి సంబంధం. మనం ఫాతిహా సూరాలో మార్గభ్రష్టుల మార్గం వద్దు అనే ‘ప్రతికూల’ (సల్బీ) మరియు సన్మార్గం కావాలి అనే ‘అనుకూల’ (ఏజాబీ) విషయాల ఆధారంగా వేడుకుంటాం. తరువాత వచ్చిన మదనీ సూరాల్లో ప్రస్తానించింది యావత్తూ వాటి వివరాలే.
ఇందులో సంబోధన ప్రవక్త ముహమ్మద్’తో కలిపి, మదీనా దైవేతరుల ఆరాధకులతోనూ అయినప్పటికీ, కాస్త నిశితంగా గమనించినట్లైతే అసలు సంబోధకులు ప్రవక్త ఇబ్రాహీం సంతతివారే అని తెలుస్తుంది. ఎలాగైతే యావత్ లోకంలో సంపూర్ణ సత్య నిరూపణ కోసం తన ప్రబోధన (నబువ్వత్), సందేశం (రిసాలత్) కొరకు ఆదం సంతతి నుండి కొందరు వ్యక్తులను ఎన్నుకుంటాడో.
ఈ అధ్యాయంలో-
1. యూద, క్రైస్తవ వర్గాలపై సంపూర్ణ సత్య నిరూపణ, వారి స్థానంలో ముస్లిం సమాజ నియామకం
2. ఇబ్రాహీం సంతతికే చెందిన వేరొక వంశమైన ఇస్మాయీల్ సంతతి నుండి ముస్లిం సమాజానికి పునాది వేయటం,
3. దాని అంతర్బాహ్యాల ప్రక్షాళన (తస్కియా వ తత్’హీర్),
4. దానితో దేవుడు ‘అంతిమ నిబంధన’ (అహద్ వ పైమాన్) చేసుకోవటం’ వంటి శీర్షికలు ప్రస్తావించబడ్డాయి.
ఈ అధ్యాయంలో ప్రస్తావించిన విషయాలు ప్రారంభం నుండి ముగింపు వరకూ ఎంతో రమ్యమైన క్రమంతో సాగుతాయి. అవి- తౌరాత్, ఇంజీల్ తరువాత ఒక కొత్త మార్గదర్శకం ఆవశ్యకత, దాని ప్రకారం ముస్లిం సమాజ స్థాపన, ఈ సమాజం కొరకు ధర్మం పరిపూర్ణమవటం నుండి అనుగ్రహ పరిపూర్తి వరకూ అన్ని ఘట్టాలు ప్రస్ఫుటమై ముందుకు వస్తాయి. ఈ క్రమాన్ని మరింత వివరంగా అర్థం చేసుకోవటానికి దాని వాదనల సంగ్రహం (Abstract) ఈ క్రింది పేర్కొంటున్నాం:
1. అల్-ఫాతిహా: ఒక కొత్త మార్గదర్శకానికి వేడుకోలు.
2. అల్-బఖర: ఈ మార్గదర్శకం విషయంలో యూదుల వైఖరి. వారిపై సంపూర్ణ సత్య నిరూపణ. ఇంకా వారి స్థానంలో ఇబ్రాహీం సంతతి నుండి వచ్చిన ఒక కొత్తశాఖ అయిన ఇస్మాయీల్ సంతతి నుండి ముస్లిం సమాజ స్థాపన, చివరిగా దాని విధుల వివరణ.
3. ఆలె ఇమ్రాన్: యూద, క్రైస్తవ వర్గాలపై సంపూర్ణ సత్య నిరూపణ, ముస్లిం సమాజ అంతర్బాహ్యాల ప్రక్షాళన.
4. అన్-న్నిసా: శీలవంతమైన సుందర సమాజానికి పునాదులు వేయటం, ముస్లిం సమాజ అంతర్బాహ్యాల ప్రక్షాళన.
5. అల్-మాయిద: ముస్లిం సమాజంపై సర్వేశ్వరుడైన అల్లాహ్ అనుగ్రహ పరిపూర్తి, ముస్లిం సమాజంతో ఆయన అంతిమ నిబంధన.
రెండవ అధ్యాయ పరిచయం
సూరయె అనాం (6) – సూరయె తౌబా (9)
ఈ అధ్యాయంలో ప్రస్తావనకు వచ్చే విషయాలు:
1) ఖురైష్’పై సంపూర్ణ సత్య నిరూపణ,
2) ముస్లిముల అంతర్బాహ్యాల ప్రక్షాళన,
3) ఖురైష్ మరియు గ్రంథ ప్రజల ఇద్దరి కోసమూ దేవుని శిక్షాబహుమానాల అంతిమ తీర్పు ప్రకటన.
ఇది ఖురాను గ్రంథ రెండవ అధ్యాయం. ఇందులో సూరా అనాం నుండి సూర తౌబా వరకు నాలుగు సూరాలు ఉన్నాయి. ఈ సూరాల్లో ప్రస్తావిత కథనాలతో తెలిసేదేమిటంటే- వీటిలో మొదటి రెండు సూరాలైన- అనాం, ఆరాఫ్- అరబ్బు కేంద్ర పట్టణమైన మక్కాలో మరియు చివరి రెండు సూరాలైన- అంఫాల్, తౌబ వలస (హిజ్రత్) తరువాత మదీనాలో అవతరించాయి. ఖురాను గ్రంథానికి చెందిన ఇతర అధ్యాయాల మాదిరి ఈ అధ్యాయమూ మక్కా సూరాల నుండి ప్రారంభమై మదీనా సూరాలతో ముగుస్తుందన్నది గమనార్హం. దీని సంబోధితులు మక్కా సూరాల్లో ఖురైష్. మదనీ సూరాల్లో ముస్లిములు. గ్రంథ ప్రజల ప్రస్తావన ఒకవేళ ఎక్కడైనా వస్తే, అది వారిని కలుపుకొని ప్రస్తావించటం జరిగింది.
ఈ అధ్యాయానికి చెందిన మక్కా సూరాల్లో- బుద్ధీ, స్వభావాల ఆధారాలతో మరియు బాహ్య జగత్తు (ఆఫాఖ్), వారి స్వీయ అస్తిత్వాల (అంఫుస్) సాక్ష్యాలతో ఇంకా చారిత్రక వాస్తవాల ద్వారా అలాగే ఖురైష్ వారు తిరస్కరించ సఖ్యంకాని నిదర్శనాలతో వాదనా తర్కం సాగింది. వాటిని ఖురైష్ వారు అంగీకరించారు కూడా. ఎందుకంటే అవి తిరస్కరించ సఖ్యం కాని యథార్థాలు కనుక.
దీని శీర్షిక- ఖురైష్ పై సంపూర్ణ సత్య నిరూపణ, ముస్లిముల అంతర్బాహ్యాల ప్రక్షాళన, ఖురైష్ మరియు గ్రంథ ప్రజల ఇద్దరి కోసమూ దేవుని శిక్షాబహుమానాల అంతిమ తీర్పు ప్రకటన. ఈ అధ్యాయం ప్రత్యేకత ఏమిటంటే- ఇందులో మునుపటి, తరువాతి సమస్త అధ్యాయాల విషయాలు తారాస్థాయీకి చేరిపోతాయి.
సందేశహరుల విషయంలో దేవుని సంప్రదాయం ప్రత్యక్షం అవుతుంది. దాని ప్రకారం వారికి అధిపత్యం లభిస్తుంది. వారి వ్యతిరేకులు తప్పనిసరిగా ఓటమి చెందుతారు.
ఈ అధ్యాయంలో సాగిన కథనాల క్రమం:
1. అల్-అనాంలో: సందేశం, హెచ్చరిక.
2. అల్-ఆరాఫ్’లో: హెచ్చరిక, సంపూర్ణ సత్య నిరూపణ,
3. అల్-అంఫాల్’లో: సంపూర్ణ సత్య నిరూపణ తరువాత దేవుని అంతిమ శిక్షాబహుమానాల కోసం ముస్లిముల అంతర్బాహ్యాల ప్రక్షాళన ఇంకా వారికి ధర్మ మార్గంలో పోరాటానికి ఆజ్ఞ.
4. అత్-తౌబాలో: అంతిమ శిక్షాబహుమానాల ప్రత్యక్షత.
మూడవ అధ్యాయ పరిచయం
సూరా యూనుస్ (10) నుండి సూరానూర్ (24)
ఈ అధ్యాయంలో ప్రస్తావనకు వచ్చే విషయాలు
1) ఖురైష్ వర్గానికి హెచ్చరిక,
2) ప్రవక్త ముహమ్మద్(స)ను విశ్వసించిన వారికి సత్య ధర్మ ప్రాబల్యం (ఘల్బ) శుభవార్త,
3) వారి అంతర్బాహ్యాల ప్రక్షాళన.
ఇది ఖురాను గ్రంథ మూడవ అధ్యాయం. ఇందులో సూరా యూనుస్ (10) నుండి సూరా నూర్ (24) వరకు పదిహేను సూరాలు ఉన్నాయి. కథనాలను బట్టి- పద్నాలుగు సూరాలు అరబ్బు దేశ కేంద్ర పట్టణం (ఉమ్ముల్ ఖురా) అయిన మక్కా నగరంలో, చివరి సూరా అయిన నూర్ వలస (హిజ్రత్) తరువాత మదీనా పట్టణంలో అవతరించినట్లు తెలుస్తుంది.
ఖురాను గ్రంథానికి చెందిన ఇతర అధ్యాయాల మాదిరి- మక్కా సూరాలతో మొదలై, మదనీ సూరతో ముగుస్తుందనే విషయం ఇందులో కూడా గమనార్హమై ఉంది-
వాస్తవానికి దీని సంబోధితులు మక్కా పట్టణస్థులైన ఖురైష్ వారు. అయినప్పటికీ, గ్రంథ ప్రజలను కూడా వారితోనే కలిపి గద్దించడం జరిగింది. ఎందుకంటే ఈ సూరాల అవతరణా నేపథ్యంలో వారు కూడా ఖురైష్ వారి పక్షానికి మద్దత్తునిస్తూ, ప్రవక్తకు ప్రతిపక్షంగా మైదానంలో వచ్చి ఉన్నారు. అంతర్బాహ్యాల ప్రక్షాళన మరియు శుభవార్తల ప్రబోధనలు చేస్తున్న వివిధ సందర్భాల్లో ప్రవక్త, ఆయన సహచరులను కూడా సంబోధించట జరిగింది. ముఖ్యంగా తాహా సూరాలో పూర్తిగా ప్రవక్తనే సంబోధినచటం జరిగింది.
దీని శీర్షికలో 1) ఖురైష్ వారికి హెచ్చరిక, 2) ప్రవక్త, ఆయన సహచరులకు- అరబ్బు దేశంలో సత్య ధర్మ ప్రాబల్య శుభవార్త. ఇంకా 3) వారి అంతర్బాహ్యాల ప్రక్షాళన. 4) ఇందులో సత్య ధర్మ ప్రాబల్య శుభవార్త కోణం ప్రస్ఫుటంగా ఉంది.
నాలుగోవ అధ్యాయ పరిచయం
సూరా ఫుర్ఖాన్ (25) నుండి సూర అహ్జాబ్ (33)
ఈ అధ్యాయంలో ప్రస్తావనకు వచ్చే విషయాలు
1) దైవ దౌత్యం (రిసాలత్) నిరూపణ విషయంలో ఖురైష్ వారికి హెచ్చరిక, శుభవార్త,
2) ముస్లిముల అంతర్బాహ్యాల ప్రక్షాళణ.
ఇది ఖురాను గ్రంథ నాలుగోవ అధ్యాయం. ఇందులో సూరా ఫుర్ఖాన్ (25) నుండి సూర అహ్జాబ్ (33) వరకు తొమ్మిది సూరాలున్నాయి. కథనాల ఆధారంగా- వీటి మొదటి భాగంలో- ఎనిమిది సూరాలు మక్కా నగరంలో, రెండవ భాగంలో- సూరా అహ్జాబ్ వలస (హిజ్రత్) తరువాత మదీనా పట్టణంలో అవతరించింది.
ఖురాను గ్రంథ ఇతర అధ్యాయాలుగానే ఇది కూడా మక్కా సూరాలతో మొదలై, ఒక మదనీ సూరాతో ముగుస్తుంది.
దీని సంబోధకులు వాస్తవానికి ఖురేష్ వర్గీయులు. గత అధ్యాయంలో మాదిరిగానే వీరితోపాటు వివిధ జాతులను కూడా గద్దించటం జరిగింది. ఎందుకంటే అవి కూడా ఈ సూరాల అవతరణా నేపథ్యంలో ఖురేష్ వారిని రక్షిస్తూ, ప్రవక్తని వ్యతిరేకించే పని చేసేవి. అంతర్బాహ్యాల ప్రక్షాళన ప్రబోధనల్లో ప్రవక్త మహనీయులు, ఆయన అనుయాయులు సంబోధకుగా ఉన్నారు. కనుక వారి సంబోధనతోనే ఈ అధ్యాయం ముగిసింది.
ఈ అధ్యాయం శీర్షికలో వచ్చిన విషయాలు- 1) దైవ దౌత్య (రిసాలత్) నిరూపణ. దాని తిరస్కార, అంగీకారాల పరంగా ఖురేష్ వర్గానికి హెచ్చరిక, శుభవార్త. 2) ముస్లిముల అంతర్బాహ్యాల ప్రక్షాళన. ప్రవక్త ముహమ్మద్ మరియు ఖురాన్ స్థానం, గొప్పతనాల గురించీ ఆయనను విశ్వసించే వారికి స్పష్టపరచటం జరిగింది.
ఐదవ అధ్యాయ పరిచయం
సబా (34) నుండి సూరా హుజ్రాత్ (49)
ఈ అధ్యాయంలో ప్రస్తావనకు వచ్చే విషయాలు
1) ఖురేష్ ప్రజలకు ఏకేశ్వర వాదం (తౌహీద్) సత్యతను నిరూపణ చేస్తూ, దాన్ని తిరస్కరిస్తే కలిగే ఘోర పర్యవసానాల హెచ్చరిక చేయటం,
2) ప్రవక్త ముహమ్మద్ మరియు ఆయనను అంగీకరించే వారికి సత్య ధర్మ ప్రాబల్య శుభవార్త ఇవ్వటం.
3) వారి అంతర్బాహ్యాల ప్రక్షాళన ఆవస్యకత గురించి ప్రబోధించటం.
ఇది ఖురాను గ్రంథ ఐదవ అధ్యాయం. ఇందులో- సూరా సబా (34) నుండి సూరా హుజ్రాత్ (49) వరకు పదహారు సూరాలున్నాయి. ఈ సూరల కథనాలతో- వాటిలో మొదటి పదమూడు మక్కా నగరంలో, చివరి మూడు సూరాలు మదీనాలో అవతరించాయి.
ఖురాను గ్రంథానికి చెందిన అన్ని అధ్యాయాల మాదిరిగానే- ఇదీ మక్కా సూరాలతో మొదలౌతుంది. ఇంకా మదీనా సూరాలతో ముగిసిపోతుంది.
దీని సంబోధితులు మక్కా ఖురేషులు. కానీ చివరి సూరాల్లో- అంతర్బాహ్యాల ప్రక్షాళనా ప్రబోధనలు మొదలౌతాయి. కనుక ఇందులో ముస్లిములు సంబోధితులయ్యారు.
దీని శీర్షికలో వచ్చే విషయాలు- ఏకేశ్వర వాద నిరూపణ. దీని తిరస్కార పర్యవసానం గురించి ఖురేష్ వర్గానికి హెచ్చరిక. ప్రవక్తా; ఆయనను విశ్వసించే వారికి సత్య ధర్మ ప్రాబల్య శుభవార్త, వారి అంతర్బాహ్యాల ప్రక్షాళన.
ఖురాను చివరి అధ్యాయం మాదిరిగానే ఈ అధ్యాయం సూరాలకీ, ఇదే విధమైన క్రమం ఇవ్వబడింది. ప్రవక్త ముహమ్మద్ సందేశానికి చెందిన విభిన్న దశలు ఈ క్రమంతో పూర్తిగా స్పష్టమై ముందుకొచ్చేస్తాయి. కాబట్టి, సూరా ఫాతిర్ వరకు బహిరంగ హెచ్చరిక దశ ప్రస్తావన ఉంది. సూరా యాసీన్ (36) ఒక ప్రత్యేకమైన సూరా. అందులో సంపూర్ణ సత్య నిరూపణా దశ మొదలౌతుంది. దీని ముగింపు సూర సాద్ (38)తో అయ్యింది.
దీని తరువాత సూరా అహ్ఖాఫ్ (46) వరకు వలస (హిజ్రత్), తెగతెంపుల ప్రకటన (బరాత్) దశలకి చెందిన విషయాలున్నాయి. ఇంకా చివరిలో భావస్వేచ్ఛను హరిస్తున్న దౌర్జన్యపరుల దాడులకి ప్రతి చర్యకి అనుమతి. సర్వేశ్వరుడైన అల్లాహ్ తరఫున విజయ ప్రాప్తి (ఫతాహ్) మరియు సంపూర్ణ సహాయ సహకారాల (నుస్రత్) వాక్దానం. ఇంకా ఇందులో అంతర్బాహ్యాల ప్రక్షాళనా దశలకి సంబంధించిన సూరాలు ఉన్నాయి. ఇవి సూరా ముహమ్మద్ (47) నుండి మొదలౌతాయి. ఇంకా సూరా హుజ్రాత్ (49)తో ముగుసిపోతాయి. ఇది అధ్యాయం చివరిలో ఒక ప్రత్యేకమైన సూరా.
ఆరవ అధ్యాయ పరిచయం
సూరా ఖాఫ్ (50) నుండి సూరా తహ్రీం (66)
ఈ అధ్యాయంలో ప్రస్తావనకు వచ్చే విషయాలు
1) మరణానంతర జీవిత నిరూపణ.
2) ఖురైషులకు మరణానంతర జీవిత తిరస్కార పర్యవసానాల హెచ్చరిక.
3) ముస్లిముల అంతర్బాహ్యాల ప్రక్షాళన.
ఇది ఖురాను గ్రంథానికి చెందిన ఆరవ అధ్యాయం. ఇందులో సూరా ఖాఫ్ (50) నుండి సూరా తహ్రీం (66) వరకు పదిహేడు సూరాలు ఉన్నాయి. ఈ సూరాల కథనాలతో వీటిలో మొదటి ఏడు సూరాలు అరబ్బు దేశ కేంద్ర పట్టణమైన మక్కాలో నగరంలో, చివరి పది సూరాలు మదీనాలో అవతరించాయి.
ఇతర అధ్యాయాల మాదిరిగానే, ఇది కూడా మక్కా సూరాలతో ప్రారంభమై మదీనా సూరాలతో ముగుస్తుందన్నది గమనార్హ.
దీని సంబోధితులు- మక్కా సూరాల్లో ఖురేష్ తెగవారు మరియు మదీనా సూరాల్లో ప్రవక్త ముహమ్మద్(స), ఆయన సహచరులు. గ్రంథ ప్రజలను కూడా వారితోపాటే ప్రస్తావించటం జరిగింది. ఎందుకంటే మక్కా సూరాల అవతరణా నేపథ్యంలో వారు కూడా ఖురైష్ వారి పక్షానికి మద్దత్తునిస్తూ, ప్రవక్తకు ప్రతిపక్షంగా మైదానంలో వచ్చి ఉన్నారు. ఇంకా మదీనా సూరాల్లో వారి ప్రస్తావన రావటానికి కారణం- ముస్లిముల్లోని కపటులకి చెందిన కొన్ని వర్గాలు వారికి ప్రభావితమై ఉండేవి.
దీని శీర్షికలో వచ్చే ముఖ్యమైన విషయాలు- 1) తీర్పుదినం రాకడ సత్యత. 2) దాని విషయంలో ఖురైష్ వర్గీయులకి హెచ్చరిక, శుభవార్త. 3) ముస్లిముల అంతర్బాహ్యాల ప్రక్షాళన. అలాగే ఇదే అంశంతో పాటు 4) అల్లాహ్, ఆయన ప్రవక్త పట్ల- సమర్పణ, విధేయతల ఆవస్యకత సమయ సందర్భాలను అనుసరించి బోధించబడ్డాయి.
ఏడవ అధ్యాయ పరిచయం
సూరా ముల్క్ (67) నుండి సూరా నాస్ (114)
ఈ అధ్యాయంలో ప్రస్తావనకు వచ్చే విషయాలు
1) ఖురేష్ నాయకులకి ప్రళయ హెచ్చరిక,
2) వారికి సంపూర్ణ సత్య నిరూపణ,
3) దాని తిరస్కార పర్యవసానంగా వారిపై రానున్న శిక్ష సమాచారం,
4) ప్రవక్త ముహమ్మద్ వారికి అరబ్బు దేశంలో సత్యధర్మ ప్రాబల్యం కలగనుందనే శుభవార్త.
ఇది ఏడవ అధ్యాయం. ఇందులో- సూరా ముల్క్ (67) నుండి సూరా నాస్ (114) వరకు నలభై ఎనిమిది సూరాలున్నాయి. వీటికి చెందిన అంశాలు మరియు అధ్యాయంలో వీటి క్రమాన్ని బట్టి చూస్తే- మొదటి 46 సూరాలు మక్కా నగరంలో, చివరి రెండు సూరాలు మదీనా పురంలో వలస (హిజ్రత్) వెళ్ళిన తొలినాళ్లలోనే అవతరించాయని తెలుస్తుంది.
ఇతర అధ్యాయాల మాదిరిగానే ఈ అధ్యాయమూ మక్కా సూరాలతో మొదలై, మదీనా సూరాలతో ముగుస్తుందన్నది గమనార్హం.
ఇందులో సంబోధన ప్రవక్తతోనూ అయ్యింది. కానీ ఓదార్పు మరియు శుభవార్తకు చెందిన కొన్ని సూరాలు తప్ప, దీని స్వభావం శ్రద్ధా పూర్వకమైనది. ఈ అధ్యాయానికి చెందిన అసలు సంబోధకులు- అబూలహబ్ నాయకత్వంలో ఉన్న మక్కా ఖురేష్ వర్గీయులు. కనుక అంశానికి చెందిన పరిణామ క్రమంతో దీని చివరి సూరాల్లో పూర్తిగా స్పష్టం అయ్యేదేమిటంటే, ఇక వేరే అభిప్రాయానికి ఏవిధమైన అవకాశమూ మిగిలి ఉండదు.
దీని శీర్షిక సంబంధించిన విషయాలు- 1) ఖురేష్ నాయకులకి ప్రళయ హెచ్చరిక. 2) వారిపై సంపూర్ణ సత్య నిరూపణ. 3) దాని పర్యవసానంగా వారికి శిక్షా వర్తమానం. 4) ప్రవక్త ముహమ్మద్ వారికి అరబ్బు దేశంలో సత్యధర్మ ప్రాబల్య శుభవార్త. ఈ అంశం ప్రారంభం నుండి ముగింపు వరకు పూర్తి అధ్యాయంలో ఎంత రమ్యం (Beauty)గా సాగిందంటే సందేశం, హెచ్చరిక నుండి వలస, తెగతెంపుల ప్రకటన వరకు సందేశానికి చెందిన సకల దశలూ ఎంతో ప్రస్ఫుటంగా మన ముందుకు వస్తాయి.
ఈ క్రమాన్ని సులువుగా అర్థం చేసుకోవటానికి దీని వాదనల సంగ్రహం లేదా సారాంశం ఈ క్రింది పేర్కొంటున్నాం. నిశితంగా గమనించండి.
1. హెచ్చరిక దశ
సూరా ముల్క్ (67) – సూరా జిన్ (72)
ప్రళయ ఘడియ సంభవాన్ని తార్కిక ఆధారాలతో నిరూపణ, దాని తిరస్కార పర్యవసానం విషయంలో ఖురేష్ వర్గానికి హెచ్చరిక. హెచ్చరించే వానిగా సందేశహరుని అంగీకరించని వారి దుష్పరిణామం. 67-68
శిక్షాబహుమానాల నిరూపణ, దాని దృశ్యం మరియు హెచ్చరించే దానిగా ఖురాను గ్రంథ సత్యతపై ‘مَا لَا تُبْصِرُوْنَ’, ‘مَا تُبْصِرُوْنَ’ యొక్క సాక్ష్యం. ఈ హెచ్చరికను అవహేళన చేసే వారికి శిక్షా వర్తమానం, వారి చేష్టల విషయంలో ప్రవక్తకు సహన బోధ. 69,70
‘مَا لَا تُبْصِرُوْنَ’, ‘تُبْصِرُوْنَ’ కి చెందిన సంక్షిప్తం యొక్క సవివరణం, దాని ఆధారంగా వారి ప్రవర్తనపై అప్రమత్తం. 71-72
2. బహిరంగ హెచ్చరిక దశ
సూరా ముజమ్మిల్ 73 – సూరా అలం నష్రహ్ 94
బహిరంగ ప్రకటన ఏర్పాట్ల కోసం ప్రవక్తకి ఆదేశం. దీని పరిధులు, అవసరాలు, ప్రారంభం. 73,74
ప్రళయదిన రాకడ నిరూపణ, దాని ఆధారంగా ఖురేష్ వర్గానికి హెచ్చరిక. 75-76; 77-78
ప్రళయదిన రాకడ నిరూపణ, దాని ఆధారంగా ఖురేష్ వర్గానికి హెచ్చరిక, దీని విషయంలో వారి తిరస్కా ధోరణిపై మందలింపు. 79-80
ప్రళయ సూచనల కదలికలు, అందులో శిక్షాబహుమానాల ఆధారాలతో ఖురేష్ వర్గానికి మందలింపు. 81-82
ప్రళయదిన శిక్షాబహుమానాల ఆధారాలతో ఖురేష్ వర్గానికి మందలింపు, ప్రళయ దినానికి సంబంధించిన సందేహాల నివృత్తి, విశ్వాసులపై వారి హింసా దౌర్జన్యాలు, సందేశహరుడు మరియు ఆయన సందేశానికి విరుద్ధంగా వారి పన్నాగాలపై వారికి దాపురించనున్న శిక్షను గూర్చిన హెచ్చరిక. 85-86
రాబోయే ప్రళయాదిన హెచ్చరిక, హెచ్చరించే వానిగా సందేశహరునికి ఓదార్పు. 87-88
వారిపై రాబోయే ప్రళయ విపత్తు హెచ్చరిక, ఖురేష్ నాయకులకు వారి తలబిరుసుతనం, బరితెగింపులపై గట్టి మందలింపు. 89-90
వారిపై రాబోయే ప్రళయ విపత్తు హెచ్చరిక, తలబిరుసుతనంపై మందలింపు, ప్రబోధన ముగింపుగా వారి కోసం మేలు-కీడు (ఫలాహ్-కుస్రాన్) మార్గాల స్పష్టీకరణ. 91-92
హెచ్చరించే వానిగా సందేశహరునికి ఓదార్పు, భవిష్యత్తులో లభించబోయే గొప్ప విజయానికి సంబంధించిన శుభవార్త. 93-94
3. సంపూర్ణ సత్య నిరూపణా దశ
సూరా తీన్ 90 – సూరా ఖురైష్ 106
సంపూర్ణ సత్య నిరూపణకి చెందిన నియమాల్లో ప్రళయ దిన నిరూపణ, దాని విషయంలో ఖురేష్ వారి ప్రవర్తనపై మందలింపు. వారి పెద్ద నాయకులకి ఖురాన్ లాంటి గొప్ప గ్రంథం ద్వారా ప్రబోధించినప్పటికీ, తమ తలబిరుసుతనంపైనే నిలకడగా ఉండిపోవటం. 95-96
హెచ్చరించేదిగా ఖురాను గ్రంథ ఔన్నత్య వివరణ. ‘ఈ ఖురానుకు బదులు మరొక గ్రంథాన్ని ఆకాశం నుండి ఒక దైవ దూత చదువుతూ తీసుకొని రావాలి!’ అని డిమాండు చేసే ఖురైష్ వర్గానికి మరియు వారి అండదండలతో నిలబడి ఉన్న గ్రంథ ప్రజల అనుచిత కోరికపై హెచ్చరిక. 97-98
ఇదే నియమంలో- ప్రళయ దినం విషయమై ఏవిధమైన అపార్థానికి గురి కావద్దని ఖురేషు వారికి హితబోధ చేయటం. ఇక్కడ చేసిన ప్రతి చిన్నా-పెద్ద, మనచి-చెడు సైతం ఆనాడు కచ్చితంగా మీ ముందుకు వచ్చితీరుతాయి, దోపిడీ దౌర్జన్యాల, అశాంతీ అలజడుల వాతావరణంలో కేవలం విశ్వజనీన పవిత్రాలం (హరం)తో తమకు ఉన్న సంబంధాన్ని బట్టి ఏ శాంతీ, సుఖాలతో వారు మనగలుగుతున్నారో, దేవుని ఏ దీవెనలు ఈ గృహం కారణంగా వారికి కలుగుతున్నాయో, వాటి విషయంలో వారు దేవునికి ధన్యవాదాలు తెలుపుకోవాలని ఇంకా ఆయన ప్రసాదించిన సంపద నుండి ఆయన మార్గంలో ఖర్చు చెట్టాలని హితవు గరపటమైంది.
ఖురేష్ నాయకత్వం ముఖ్యంగా అబూలహ పేరును ప్రస్తావించి మరీ, వాడు నశించిపోక తప్పదు అనే భవిష్యవాణి, సందేశహరుని తరఫున ఇక ఏకేశ్వర వాద విశ్వాసమే ప్రాబల్యం వహించబోతుందనే నిర్ణయాత్మక ప్రకటన. 111-112
4. వలస, తెగతెంపుల దశ
సూరా మావూన్ 108 – సూరా ఇఖ్లాస్ 112
ఖురేష్ నాయకులు అంగీకరించిన నేరాల చిట్టా, దాని పర్యవసానంగా వారికి కలగబోయే దైవశిక్షా సమాచారం, ఇంకా సందేశహరులకు మక్కా ధర్మకత్వం వారికి కిబదులు మీకు బదలీ కానుందనే, ఇంకా మీ శత్రువులను అరబ్బు భూ భాగం నుండి పూర్తిగా తుడిచి వేయటం జరుగుతుందనే శుభవార్త. 107-108
మక్కా పట్టణ ధర్మధిక్కార ధ్వజవాహకులతో సందేశహరుని తెగతెంపుల తీర్మానం, అరబ్బు క్షేత్రంలో సత్య ధర్మ విజయకేతన శుభవార్త.109-110
ఖురేష్ నాయకత్వం ముఖ్యంగా అబూలహ పేరును ప్రస్తావించి మరీ, వాడు నశించిపోక తప్పదు అనే భవిష్యవాణి, సందేశహరుని తరఫున ఇక ఏకేశ్వర వాద విశ్వాసమే ప్రాబల్యం వహించబోతుందనే నిర్ణయాత్మక ప్రకటన. 111-112
5. ముగింపు
సూరా అలఖ్ 113 – సూరా నాస్ 114
ముగింపు అధ్యాయంలో- మీ మిషన్ భద్రత కోసం ప్రాపంచిక సకల ఆపదల నుండి కాపాడమని, దుష్టులైన యూదుల, ఖురేషుల మరియు షైతాను సంతతి నుండి కాపాడమని మీ ప్రభువును వేడుకోమని సందేశహరుని కోరటం. ఎందుకంటే భవిష్యత్తులో సాతాను సంబంధమైన జిన్నులు, మనుషులు రాబోయే కాలంలో పూర్తి శక్తితో మీపై దాడి చేయనున్నారు. 113 – 114
మూలం: జావేద్ అహ్మద్ ఘామిది, అనువాదం: ముష్తాఖ్ అహ్మద్ అభిలాష్